లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నీ రాజ్యము నిత్యము ఉండే రాజ్యము

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తనలు 145 : 13వ

''నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాల తరతరములు నిలుచును''.

క్రైస్తవ జీవితం ఎదిగి పరిక్వతకు వచ్చినపుడు ఈ రీతిగా దేవున్ని ఎల్లప్పుడు స్తుతిస్తూ ఉంటుంది. ఒక నిజమైన క్రైస్తవుడు తన హృదయములో దేవుని రాజ్యము నిత్యము ఉండే రాజ్యమని తలుస్తాడు. తన స్వాతంత్వ్రమును హృదయమందు అనుభవిస్తూ ఉంటాడు. అతని మీద ఏ పాపము ఏలుబడి చేయదు. దేవుని యందు భద్రముగా ఉంటాడు. నిత్య సూత్రములను వెంబడిస్తున్నానని ఎరుగును. కీర్తనలు 30:4

''యెహోవా భక్తులారా! ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామమును బట్టి ఆయనను స్తుతించుడి.'' కాని హోషేయ 7:14 లో దేవుడు చెప్పుచున్నాడు, ''హృదయపూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యల మీద పరుండికేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధ్యానమద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు''. కీర్తనలు 145:18లో ఈలాగు వ్రాయబడింది.'' తనకు మొఱ్ఱపెట్టు వారి కందరికీ, తనకు నిజముగా మొఱ్ఱపెట్టు వారికందరికీ యెహోవాసమీపముగా ఉన్నాడు.'' మనము దేవునికి మన హృదయమంతటితో మొఱ్ఱపెట్టాలి. దేవుని యొద్ద మనకు ఎల్లప్పుడూ క్షమాపణ దొరుకుతుంది. నిన్ను నీవులోతుగా త్రవ్వి పరీక్షించుకుంటే నీవు ప్రార్థన వసరతలో ఉన్నావని తెలుస్తుంది. ఇతరుల పాపములు లెక్కకురావు కాని నీస్వంత వైఫల్యములు గ్రహిస్తావు. నీవు దేవునితో సరిపడితే నీ పరిస్థితులు అన్నీ నీకు అనుగుణంగా మారుతాయి. నీవు దేవుని వాక్యము చదివి నీ స్వభావములోనికి లోతుగా త్రవ్వి దేవుని స్వభావము నీలోనికి రానిస్తే నీ ఆత్మలో విడుదల చూస్తావు. నీవు నిత్య రాజ్యమునకు చెందినవాడవని గమనిస్తావు. క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా నిత్యము ఆ రాజ్యము యొక్క విధులు నియమించబడినవి. యోసేపు బానిసగా ఉండినాడు కానీ హృదయములో స్వేచ్చాపరుడు. త్వరలోనే అతనికి ఉండిన స్వాతంత్వ్రము చుట్టూ వ్యాపించింది. అతడు ఖైదులో నుండి బయటకు వచ్చాడు. అత్యున్నతమైన పదవికి ఎత్తబడ్డాడు. ఆయనపైన ఆయనను నిర్బంధించడానికి ఎవరూలేరు.

దేవుడు నీతో ఉండి నీ అపజయములను జయములుగా మారుస్తాడు. పడిపోయిన ఒక జాతికి చెందిన వాడవని గుర్తించు ఆయన వాక్యమును భుజించు, ఆయన మాటలు నీలో నిలువనీ, నీ వెంతవరకు ఆయనకు విధేయుడవు అవుతావో అంతవరకూ ఆయన మాటలు నీలో నిలచి యుంటాయి. మన స్వార్థం మనలను ఖైదీలుగా చేసింది. మన స్వార్థం మరణించాలి. అప్పుడు మనము స్వతంత్రులముగా ఉంటాము. అది అయిన తర్వాత మనం ఎక్కడకు వెళ్ళినా సరే చీకటి శక్తులు మనలను గమనిస్తాయి.'' ఇదిగో ఇక్కడొక మనుష్యుడున్నాడు. దేవుని ముద్ర అతని నుదుట వేయబడింది. అతనిని ఎదిరించలేము.'' ప్రజలు నీ మీద ప్రభుత్వము చేయడానికి ప్రయత్నించవచ్చుగానీ నిజమైన యజమానివి నీవే. నీ ధైర్యము దేవుని యందే. నీవు దేవుని యెదుట పవిత్రమైన మనస్సాక్షి కాపాడుకొనుట ద్వారా దేవునియందు నీకు బలమైన ఒక స్థానం దొరుకుతుంది. దానిని పోగొట్టుకొనవద్దు. ఈ ధైర్యము నీలో గర్వము పుట్టించదు. అది సాధుత్వము, జయించే ఆ స్వభావము నీదీనత్వమందు కనబడుతుంది. నీవు అతి దీనుడవు అయిఉంటే నీవు అతికోరదగినవాడవు. ఆ నిత్యరాజ్యము యొక్క సూత్రములు వెంబడిస్తున్నావు. నిన్ను నీవు ఏ రీతిగా నిర్మించుకోవాలంటే నీవు ఎప్పుడూ ఓడిపోవు.

నీ పవిత్రత సూత్రములలో తబ్బిబ్బు పడవద్దు. ఈ పొలములో అంగుళము స్థలము కూడా వదలిపెట్టవద్దు. కొంతసేపు పోరాటములు ఉండవచ్చు. పరలోకపు ఆశలతో నీ హృదయము నింపుకో. సామెతలు 22:17,18 ''చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము.'' దేవుని వాక్యము నీకు సలహానిచ్చేదిగా ఉండనీ. సామెతలు 30:5 ''దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కీడెము.'' నిన్ను నీవు ఎల్లప్పుడు దేవుని వాక్యముతో నింపుకుంటే నీవు ఉద్రిక్తస్థితిలో సమతలంగా ఉంటావు. సరియైన భక్తి నీలోపల పొందికను తెస్తుంది. మరియు నీ ఉద్రిక్త జీవితంను సంపూర్ణంగా సమతలంగా ఉంచుతుంది. నిశ్చయమైన ఓటమి వచ్చునని రూఢిగా నీకు తెలిసినప్పటికీ నీవు విడిచిపెట్టవద్దు. అపజయమునకు ఎదురుగా వెళ్ళు తున్నప్పటికీ జయమును స్వతంత్రించుకో, నీవుదాన్ని పొందుతావు. నీలో నీకు విజయము ఉన్నదని గ్రహింపు అవుతుంది. దేవుని హత్తుకో, నీ జీవితము దేవునిది. ఆ విజయ సూచన నీలో ఉండాలి మన స్వభావము పాపముతో నిండివదే. కాని దానిని దేవుని ఎదుట పెడతాము. దాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకున్నప్పుడు మనం ఇంకనూ దేవుని ఎదుట దానిని ఉంచుతాం. దేవుని నీతి నీకు దొరికినప్పుడు నీవు స్వతంత్రుడవుగా ఉంటావు. యధావిధిగా అదినీలోనుండి, నీ జీవితంలో నుండి, నీ కన్నులలో నుండి ప్రవహించినప్పుడు నీవు స్వతంత్రుడవుగా ఉంటావు. నీ నాలుకను దేవుని ఆత్మపట్టుకున్నప్పుడు పరిపూర్ణంగా ఆశ్చర్యకార్యాలు మాట్లాడతావు.

మూల ప్రసంగాలు