లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నీవు సంసిద్ధము చేయబడి ఉన్నావా?

కీ.శే. యన్‌. దానియేలు గారు
1 దిన వృ 22:16

''బంగారము, వెండి,ఇత్తడి, ఇనుము వీటిలో లోటు లేదు. కనుక నీవు లేచి కార్యమును ఆరంభము చేయుము. ప్రభువు నీతో కూడా ఉన్నాడు''. దేవాలయమును గూర్చి, దేవాలయపు కట్టడమును గూర్చి సాలోమోను తండ్రి దగ్గర నుండి ఉపదేశం పొందుచుండెను. ఆయన తండ్రి అవసరమైనటువంటి డబ్బును బంగారము, వెండి, ఇత్తడి మున్నగు సరుకులు అన్నియు సమకూర్చాడు. దావీదు తానే దేవాలయము నిర్మాణం చేయవలెనని ఆశించాడు. కాని దేవుడు అతనితో ఇలాగు చెప్పాడు. ''నీవు తగవు. నీవు యుద్ధమునకు వెళ్ళే వాడివి.నీవు చాలా రక్తము కార్చినావు. నీ కుమారుడు నా కొరకు ఒక దేవాలయము కట్టును'' దావీదు సొలోమోనుతో ''నీవు భయపడవద్దు, నేను సమస్తమును సిద్ధపరచియున్నాను'' చాలా జాగ్రత్తగా సొలోమోను దేవాలయమును నిర్మించాడు. అతడు యౌవనస్థుడిగా ఉండినప్పుడు అతడు ప్రార్థించి ఇతరులను పరిపాలించే జ్ఞానమును సంపాదించుకున్నాడు. ఆయన తండ్రి యొక్క సిద్ధపాటుకు సరిపోయినది. కాని సొలోమోను యొక్క సిద్ధపాటు దేవాలయ నిర్మాణం నిమిత్తము తన దేశము, తన గృహము, తన శీలము వీటిని నిర్మించటానికి తగిననట్టుగా లేదు. నీవు సంఘమును కట్టాలి. అది సాధ్యపడవచ్చు. కాని నీ గృహమును, నీ గుణశీలమును నీవు కట్టుకోలేవేమో, క్రైస్తత్వమనేది సర్వతోముఖ్యమైన భక్తి. వేదిక భక్తి మట్టుకు కాదు. ఒకడు ఒక మంచి ప్రసంగం చేయవచ్చును. కాని తన జీవితమే ఒక ప్రసంగంగా అతను భావించడు. సొలోమోను యొక్క జీవితంలో అతడు సగం మట్టుకే సిద్ధపడ్డాడు. ఆయన ఎడారిలో నుండి ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి తినుబండారములు సగము మట్టుకే తీసుకువెళ్ళాడు. ఇలాంటి పరిస్థితులలో ఎడారి సగం దూరం వెళ్ళేటప్పటికి అతని భోజన పదార్థములు అయిపోయినవి. కనుక అతను నశించిపోయినాడు. ఒక దేశమును తన కుటుంబమును కట్టుకోవడానికి అవసరమైన ఆత్మీయ అవశ్యకతలు భరించడానికి సొలోమోను సిద్ధంగా లేడు.

మనం మన రిట్రీటు త్వరలో జరుపబోవుచున్నాము. కాని దానికయ్యే ఖర్చు నా దగ్గర లేదు. దాని గూర్చి సంతోషిస్తున్నాను. మన గత రిట్రీటులన్నిటిలో ఇదే పద్ధతి. వచ్చినటువంటి అతిథులకు అందరికి భోజనం పెట్టుటకు రిట్రీటులో కావాల్సిన డబ్బు ఉంటే బాగా చేసినానని ఒకడు అనుకోవచ్చు. కాని అతిథులకు అవసరమైన ఆత్మీయ ఆహారం లేకపోతే దేవుడు ఎన్నడూ తృప్తి చెందడు. సంఘంలో ఉన్నటువంటి దుష్ప్రవర్తనలన్నిటికి వ్యతిరేకముగా పోరాడగలిగినటువంటి ఫెలోషిప్‌ను నిర్మాణం చేసుకోవాలి. మనము తగిన సిద్ధపాటులో ఉన్నామా? తగినంత సిద్ధపాటు లేకుండా దీని కొరకు మనం ప్రయాసపడకూడదు. కొద్దికాలమైన తరువాత ప్రజలు మన మీదకు తిరుగుబాటుతో లేస్తారు. వారికి స్వస్థత కావాలి. వారి యౌవనస్థులు శ్రేష్ఠమైన జీవితం జీవించాలని కోరతారు. ఇంకను శ్రేష్ఠమైన పాష్టర్లు కావాలని కోరతారు. కానీ మన చుట్టూ ఉండే దుష్టమైన సంస్కృతిని, బంగారం మీద ప్రేమను మీరు తృణీకరించినట్లయితే వారు నిన్ను బయటకు త్రోసివేయవచ్చును. మనం వీటికి వ్యతిరేకంగా బోధించటం లేదు కాని చివర వరకు వెళ్ళడానికి సాధ్యపడుతుందా? మనుష్యులకు ద్రవ్యము, విద్య మట్టుకే కావాలి. స్త్రీలయితే వారి ఆభరణముల మీద దృష్టిపెడతారు. మనము ఒక రకమైన ఉజ్జీవం కోరతాము. కాని ఈ వేరులన్నియు పెరికి పారవేయటానికి కాదు. మనం సగం భోజనం మట్టుకు తీసుకువెళుతున్నామా? ధర్మశాస్త్రము మోషే తీసుకువచ్చి దానిని ఇశ్రాయేలు బిడ్డలకు నేర్పించాడు. ఇది ఐగుప్తు దేశంలో నేర్పించారు. వీరు దాసరికపు దేశంలో దానికి విధేయులు అయి ఉందురా? లేదు. వారు ధర్మశాస్త్రమునకు విధేయులు కాకముందు వారు విడుదల పొందాలి. అయినప్పటికి అనేకసార్లు వారు ఐగుప్తు దేశంలో కొలువు చేసిన దినములో వారు పడిన కష్టాలను మరచిపోయారు. ఐగుప్తు దేశంలో వారు మాంసము తిన్నటువంటి పాత్రలు జ్ఞాపకమునకు వచ్చినాయి. క్రైస్తవులకు దాసత్వపు మనసు ఉంటుంది. మనం ఆలయంలో ప్రవేశించటానికి ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉన్నామా? సొలోమోను వస్తు సంబంధమైన సామగ్రిని దేవాలయము కొరకు చూచినప్పుడు సంతోషించాడు. దేవుని సన్నిధి దేవాలయము మీదికి దిగి వచ్చినప్పుడు దానితో అతను తృప్తి చెందాడు. అతడు ఒక యౌవనస్తుడు. అది రాజ్యములో సమాధానము ఉండిన సమయము. అతని తండ్రి అనేక పోరాటములు పోరాడి శత్రువులను దేశంలో నుండి బయటకు తరిమి వేశాడు. సొలోమోను ఇప్పుడు దేశమును నిర్మించాలి. దేశములోని దుష్టశక్తులతో పోరాడాలి. క్రైస్తవులకు నిజమైన పోరాటం ఏదంటే చీకటి శక్తులకు వ్యతిరేకమైన పోరాటం. నీవు పోరాడి శత్రువును బయటకు తరిమి వేయవచ్చునుగాని వారి వలన దేశములోనికి వచ్చిన కీడు సంగతి ఏమిటి? మన క్రైస్తవులు వారి చుట్టూ ఉన్న వారి యొక్క దుష్ట అలవాట్లను నేర్చుకున్నారు. నిజమైన పోరాటం వీటికి వ్యతిరేకముగా ఉంటుంది. అనేక మంది మారుమనస్సు పొందినారు కాని వారి అలవాట్లను బట్టి ముందుకు సాగటం లేదు. మన దగ్గర కొంత సామగ్రి ఉన్నది కానీ మనకు పరిశుద్ధత, దీనత్వము, ఆత్మీయ దృష్టి కావాలి.

సొలోమోను ఆలయంను నిర్మాణం చేసిన తర్వాత షెబ దేశపు రాణి అతనికి ఇచ్చినటువంటి పొగడ్తను అందుకున్నాడు. తరువాత తన రాజరికంలోని మహిమ తగ్గిపోవటం ప్రారంభించింది. అతడు ఇతర దేవుళ్ళకు ఆలయాలు నిర్మించటం ప్రారంభించాడు. ఫరో కుమార్తెను వివాహమాడాడు. తన యౌవన దినములలో దేవుని కలుసుకున్న సొలోమోను ఇతడేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు అతనిని కలుసుకొని రాజ్యము విభాగించబడబోవుచున్నది అని చెప్పాడు. దేశము 12 భాగాలుగా చేయబడుతుంది. అందులో 10 భాగాలు వేరొకనికి ఇవ్వబడుతుంది అని చెప్పాడు. ఈ ఉత్తర భాగమునకు ఏమి సంభవించినది. శత్రువులు 10 గోత్రముల మీద దండెత్తి, మరలా దండెత్తి చివరకు ఆ పది గోత్రములు పాడైపోయే వరకు వారు దండెత్తారు. సోలోమోను ద్రవ్యముతో ఆయన సిద్ధముగా నుండినాడు. కాని ఆత్మీయ జీవితంలో జారిపోయాడు జాగ్రత్త! నీ అంతస్తుపైన నీవు బోధించవద్దు. దేవుడు నిన్ను సాక్ష్యము మట్టుకు ఇమ్మంటే నీవు బోధించవద్దు. మనుష్యులు నిన్ను అభినందించవచ్చు. దానిని అంగీకరించవద్దు. కాకినాడలోని ప్రజలు, కాకినాడలో నాకన్నా దేవుని వాక్యం బాగా ఎరిగినవారు లేరు అని చెప్పారు. కాని నేను ఇక్కడకు వచ్చి సేవ ప్రారంభించిన తరువాత నాకు ఉండిన జ్ఞానం చాలా తక్కువని తెలిసింది. నాకు కొంత ఆత్మీయ అనుభవం ఉన్నప్పటికి ఇప్పుడు అది నాకు సరిపోదని తెలిసింది. దావీదు కావాల్సినంత వస్తు సామగ్రిని దేవాలయం కొరకు సిద్దపరిచాడు. అది సరిపోతుందా? సొలోమోను ఇతరులను పాలించటానికి జ్ఞానం సంపాదించాడు కాని తన్ను తాను పరిపాలించుకోగలడా? ఇతరులను పాలించడం సులువు? ఒకడు తన ఆత్మను, తన గృహంను పాలించుకోగలడా ''తన ఆత్మను పాలించగలిగిన ఒకడు ఒక పట్టణమును గెలుచుకున్న వాని కన్నా గొప్ప ఘనతను పొందును'' పరిశుద్ధాత్ముడు నీ మీద సంపూర్ణ ఆధిపత్యం వహించాడా. అనేకమంది బాగా ప్రారంభిస్తారు. కాని తమ మార్గమంతటి కొరకు తమ్మును తాము సిద్ధపరచుకొనరు. నెహఙమ్యా 13:26 ''ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలోమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవునిచేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీలయులందరి మీద రాజుగా నియమింపబడిననూ అన్యస్త్రీలు అతనితో సహా పాపము చేయించలేదా? మనం రిట్రీటు కొరకు ప్రార్థన చేద్దాం, వెండి, బంగారములు, సామగ్రి మన దగ్గర లేనందుకు దేవునిని స్తుతిద్దాం. ఆత్మీయంగా మనలను మనం సిద్ధపరచుకొందాం. ఫెలోషిప్‌ను దేవుని పరిపూర్ణచిత్తంలో నిర్మాణం చేయుటకును వారికి పూర్తిగా దేవుని నగ్న సత్యంలో నడిపించుటకును మనకు గొప్ప బాధ్యత ఉన్నది.

మూల ప్రసంగాలు