లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని వాక్యము నిజమైన ధనాగారము

కీ.శే. యన్‌. దానియేలు గారు
కీర్తనలు 19 : 7- 11 వరకు

''వాటివలన నీ సేవకుడు హెచ్చరికనొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును'' దాని విలువను ఎరిగిన వారికి దేవుని వాక్యం బంగారం వంటిది. దేవుడు విలువైన వాడు ఆయనను జాగ్రత్తగా కాపాడాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. దాని విలువ నెరిగిన వారు దానిని పొందుటకు ప్రయాసపడతారు. ఈ లోకంలో బంగారం ఎంత ఎక్కువగా ఉంటే అంత శక్తివంతమైన దేశంగా ఉండును. లోకం అంతటా అంగీకరింపబడే విలువ అది బంగారం యొక్క విలువ. అనగా దేవుని వాక్యము ఎంతగా అంగీకరించి విధేయుడవు అవుతావో దాని మీద ఇతరులకు సహాయం చేయగల శక్తి ఆధారపడి ఉంటుంది. లోకంను మార్చే శక్తి నీవు కలిగి ఉంటావు. 11వ వచనం దేవుని వాక్యం చదువుట ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. దేవుని వాక్యము చదవని వారు సార్థకమైన విధముగా ప్రార్థన చేయలేరు. దేవుని వాక్యము ద్వారా మన హృదయం సార్థకమైన రీతిగా ప్రార్థించుటకు సరియైన పరిస్థితిలోనికి తేబడును. కీర్తనలు 138:2 ''నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్పచేసియున్నావు. దేవుడు తన వాక్యమునకు తన నామము కన్నా ఉన్నతమైన స్థలం ఇచ్చును. దేవుని వాక్యమును ఎరిగి దానికి విధేయుడవుట ద్వారా దేవుని రాజ్యములో ఒక క్రైస్తవుని స్థిరత్వం ఆధారపడి ఉండును. దేవుని నీతి కలిగిన వాక్యము నిమిత్తము దావీదు దేవుని ఏడుసార్లు దినానికి స్తుతించేవాడు. కీర్తనలు 119:165 ''నీ ధర్మశాస్త్రమును ఉపయోగించు వారికి ఎంతో నెమ్మది కలుగును, వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియు లేదు'' దాని భావం ఏమంటే వారు క్రింద పడరు. దేవుని వాక్యం చేత నీవు ఎంతగా నింపబడతావో నీ ప్రార్థన కూడా అంత కార్యసాధకమై ఉండును. ప్రార్థన దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడిన హృదయం నుండి వచ్చే కొలది అది కార్యసాధకమై ఉండును. నీవు దేవుని వాక్యమును ధ్యానించకపోతే నీ ప్రార్థన యొక్క విలువ కూడా క్రిందకు పడిపోవును. దేవుని వాక్యజ్ఞానం మీద దానికి విధేయుడయ్యే వరకు నీ ప్రార్థన విలువ పెరుగుతుండును.

యోహాను 14:19-21. ఇద్దరు స్నేహితులుండగా వారి మధ్య వస్తుసామగ్రి పంపకం వారి మధ్య ఉండే ప్రేమ మీద ఆధారపడి ఉండును. మనం దేవుని యెడల కలిగి ఉండే ప్రేమ మనం ఆయన వాక్యమునకు విధేయత చూపే దాని మీద ఆధారపడియుండును. దేవుని నీవు ఎంతవరకు గుర్తిస్తావో అంతవరకు నీ ప్రయోజకత్వం కూడా ఉండును. దేవునిని నీవు గుర్తించేది దేవుని యెడల నీకుండే ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. నీవు దేవుని యెడల చూపించే ప్రేమ నీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది. నీవు అవిధేయతకు అలవాటుపడిన వాడవైతే నీ ప్రార్థన పురిపెట్టినట్లుండును. చివరకు అది నీకే హానికరముగా మారును. దేవునిని దేనికొరకు అడగవలెనో ఎరుగకుండా ఉంటాము. చివరకు హానికరమైనవే అడుగుతుంటాము.

యోహాను 15:7 ''నా యందు మీరును, నా మాటలు మీ యందును నిలిచి యుండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అది మీకు అనుగ్రహింపబడును'' మనం దేవుని వాక్యమునకు అవిధేయులం అయినట్లయితే దేవుని వాక్యమునకు మనలో చోటులేదు. '' మీరు నాయందు నిలచియుండిని యెడల - మీ తలంపులు ఎల్లప్పుడు నాతో నిండియుండిన యెడల అప్పడు మీకు ఏది ఇష్టమో ఆయనను అడుగుడి'' ఆయన వాక్యం మనయందు నిలిచియున్న యెడల ఎంతటి ఆశ్చర్యకరమైన మనుష్యులము అగుదుమ. దేవునితో నిండిన మనుష్యుడవగుదువు. నీ ఆలోచన సరళియే నీ వ్యక్తిత్వము. నీ తలంపులు దేవుని తలంపులతో నిండి ఉంటే నీవు ధనికుడవైన మనుష్యుడవు. '' బంగారం కంటెను కోరతగినది తేనె కంటెను మధురమైనది. వాటిని గైకొనుట వలన గొప్పలాభం కలుగును''

1 యోహాను 5:14, 15వ ''ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదనదియే. మనం ఏమి అడిగినను మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనం ఎరుగుదుము''. ఈ బోధలన్నీ ఉన్నతమైన మెట్టులో ఉన్నవి. మనం ఆయనను ఆయన చిత్తానుసారముగా అడుగగలిగినది ఎప్పుడు? మనం ఆయన తలంపులతో నిండియుండినప్పుడే. క్రీస్తు ''మీరు నన్ను విశ్వసించుచు ఏమి అడిగననూ మీరు దాన్ని పొందియున్నారు''. యేసు చెప్పాడు, దేవుని వాక్యంను మన హృదయంలో భద్రం చేసుకొన్నప్పుడు దానిలో నుండి వచ్చే ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉండును. అప్పుడు మనం గొప్ప నమ్మకంతో ప్రార్థన చేయగలం. యోహాను 11:41 ''అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి ''తండ్రీ నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను'' ఈ ప్రార్థన యందు ఉన్నటువంటి గొప్ప నమ్మిక చూడండి! దేవుని వాక్యమును అందుకొని దానికి విధేయుడవు అగుటలో సమస్తమైన ఆశీర్వాదములు దాగి ఉన్నవి. నన్ను ఆశీర్వదించుము, ఆశీర్వదించుము అని ప్రార్థించుటలో ప్రయోజనం లేదు. ఒక చిన్నబిడ్డ తన తండ్రిని బంగారం కొరకు అడిగినట్లుగా ఉన్నది. దానిని ఎలాగు కాపాడుకొనవలెనో, లేక దానిని వినియోగించవలెనో ఎరుగడు. మన ప్రార్థనలు అనేకములు అర్థరహితముగా ఉన్నవి. మనము దేవుని వాక్యమునకు విధేయులము అయినప్పుడు సాతాను గడగడ వణుకును. క్రీస్తు తాను ఎల్లప్పుడు తండ్రిని సంతృప్తి పరిచే కార్యములనే చేసాడు. దేవుని పిల్లలు దేవుని వాక్యమును బంగారం కన్నా విలువైనదిగా ఎంచుదురు. వాటిని గైకొనుటలో బహుమానము ఉన్నది.'' మనము దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. దేవుని వాక్యపు వాతావరణం ఉండే గృహంలో నుండి దయ్యం పారిపోతుంది. ఒకప్పుడు పరిశుద్దుడైన ఫ్రాన్సిస్‌ ఆయన శిష్యులు నివసించుచుండిన ఇంటి సమీపంలో చాలా దయ్యములు చూసాడు. కాని అవి లోపలికి రాలేదు. ఆ సమూహంలో ఇద్దరు సోదరులు ఒకరితో ఒకరు పోట్లాడుకొని ద్వేషించుచు ఉండగా అప్పుడు దయ్యములు లోపలికి వచ్చినవి. ప్రేమ వాతావరణం ఉన్న చోట దయ్యం ప్రవేశించలేదు. నీవు దేవుని మహిమార్థమై జీవించగోరితే దేవుని వాక్య ప్రకారం జీవించి దానికి సార్థకముగా ఉండాలంటే నీవు దేవుని వాక్యానికి విధేయుడవు కావాలి. ''అవి బంగారం కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరతగినవి. ''దేవుని చిత్తములో ఉండే మనుష్యుడు తన హృదయ వాంఛలన్నియు తాను ఏ ప్రయాస పడకుండా నెరవేరడం చూస్తారు. నీ ఆశలన్నిటిని వాటి కొరకు నీవు అడుగకపోయిననూ సరే పరలోకం వాటిని నెరవేర్చును. దేవుని వాక్యం చేత నింపబడి యుండగా నీ కోరికలన్నీ అత్యున్నతమైనవిగా ఉండును. అవి నెరవేరును. నీవు ఆయనతో ఒకటిగా ఉన్నందుకు దేవుడు సంతోషించును. ఆయన నీతో ఒకటిగా ఉన్నందుకు నీవు సంతోషించుదువు.

మూల ప్రసంగాలు